: హైదరాబాదును మనమే అభివృద్ధి చేశాం... అదిప్పుడు పక్క రాష్ట్రంలో ఉంది: చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా తూపిరిపాలెంలో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రం కష్టాల్లో ఉందని చెప్పారు. హైదరాబాదును మనమే అభివృద్ధి చేశామని, అయితే, అదిప్పుడు పక్క రాష్ట్రంలో ఉందని పేర్కొన్నారు. తమిళనాడుకు చెన్నై ఉందని, కర్ణాటకకు బెంగళూరు ఉందని, అవి మూడు మహానగరాలని, బాగా అభివృద్ధి చెందిన నగరాలని తెలిపారు. మనకు రాజధాని లేదని, తయారుచేసుకోవాలని అన్నారు. ఆ రాష్ట్రాల స్థాయికి వచ్చే వరకు ఏపీకి కేంద్రం సాయంచేయాలని చంద్రబాబు కోరారు. ఇక, సభావేదికపై ఉన్న వెంకయ్యనాయుడు గురించి చెబుతూ, విభజన సందర్భంగా సభలో ఎవరూ మాట్లాడనప్పుడు ఏపీ కోసం గట్టిగా మాట్లాడింది వెంకయ్యేనని ప్రశంసించారు. వెంకయ్యతోపాటు అరుణ్ జైట్లీ కూడా పోరాడారని తెలిపారు.