: 208 ఇళ్ల కోసం రూ. 1,098 కోట్లా? పెద్ద కుంభకోణంలా ఉంది!: సుప్రీంకోర్టు
కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ పెద్ద కుంభకోణంలా కనిపిస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అర్బన్ షెల్టర్ హోంల నిర్మాణం పేరిట వందల కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అప్పగించగా, పనులు జరగలేదని ఆక్షేపించింది. "రూ. 1,078 కోట్ల రూపాయలను రాష్ట్రాలకు అందిస్తే, కేవలం 208 ఇళ్లు మాత్రమే కట్టారు. మీరు ఇచ్చిన అఫిడవిట్ చూస్తుంటే మొత్తం విషయం అర్థం అవుతోంది. ఇదో పెద్ద స్కామ్" అని జస్టిస్ మదన్ బి లోకుర్, యూ లలిత్ లతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. అంతకుముందు పట్టణ పేదలకు షెల్టర్లపై మహారాష్ట్రకు రూ. 170 కోట్లివ్వగా, ఒక్కటీ కట్టలేదని, ఉత్తరప్రదేశ్ కు రూ. 180 కోట్లివ్వగా, 37 షెల్టర్లు కట్టారని కేంద్రం కోర్టుకు తెలిపింది. మొత్తం వ్యవహారంలో కేంద్రం ఇచ్చిన నిధులను ఏ రాష్ట్రం ఎలా వెచ్చించిందో తెలియజేయాలని, రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.