: ఆడపిల్లలున్న చోట అదృష్టం ఉంటుంది!: అమితాబ్ బచ్చన్
ఆడపిల్ల ప్రత్యేకమైన బహుమతి అని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తెలిపారు. తన తాజా సినిమా 'పీకూ'లో టీనేజ్ యువతికి తండ్రిగా నటించిన అమితాబ్, కుమార్తెల గురించి తన బ్లాగ్ లో రాశారు. కుమార్తెలంటేనే ప్రత్యేకమని ఆయన పేర్కొన్నారు. ఆడపిల్లలున్న ఇంట్లో సిరిసంపదలు, సంతోషాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. కుమార్తెలున్న చోట అదృష్టం ఉంటుందని అమితాబ్ తెలిపారు. కుమార్తెలు కేవలం కుటుంబంలో సంతోషాలనే కాకుండా, గొప్ప కుటుంబం నిర్మించగలరని, ఇతరులకు మార్గదర్శనం చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు. ఆప్యాయత, అనురాగాలతో ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చేస్తారని ఆయన వెల్లడించారు. తన కుమార్తె శ్వేత విషయంలో తానెంతో గర్వపడుతున్నానని అమితాబ్ చెప్పారు. నటజీవితంలో, నిజజీవితంలో కుమార్తె విషయంలో తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆయన వివరించారు.