: ఇంటిదారి పట్టిన వరల్డ్ నెంబర్ వన్ సైనా ... హ్యాట్రిక్ కొట్టిన తాయ్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ నుంచి వరల్డ్ నెంబర్ వన్ షట్లర్ సైనా నెహ్వాల్ నిష్క్రమించింది. చైనాలోని వుహాన్ లో జరుగుతున్న ఈ పోటీల్లో, సైనా క్వార్టర్ ఫైనల్లో జు యింగ్ తాయ్ చేతిలో 21-16, 13-21, 18-21తో ఓటమిపాలైంది. ఇటీవలి కాలంలో ఐదో సీడ్ తాయ్ కి సైనాపై ఇది వరుసగా మూడో విజయం. ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి గేమును గెలుచుకున్న సైనా, ఆ తర్వాత అనూహ్యంగా రెండు గేములను ప్రత్యర్థికి కోల్పోయింది. సైనాను బేస్ లైన్ కి పరిమితం చేయడంలో చైనా అమ్మాయి విజయవంతం అయింది. ఇక, ఈ టోర్నీలో భారత్ నుంచి పీవీ సింధు ఒక్కటే మిగిలింది. సింధు క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్ లి జురుయ్ తో తలపడనుంది.