: 1:1 బోనస్ ప్రకటించినా 'బేర్'మన్న ఇన్ఫోసిస్!
విశ్లేషకులు ఊహించినట్టుగానే గడచిన ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో దేశంలోని రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ నికర లాభం తగ్గింది. 2013-14 క్యూ-4లో రూ.3,250 కోట్ల నెట్ ప్రాఫిట్ నమోదు చేసిన సంస్థ ఈ యేడు 2.6 శాతం శాతం తక్కువగా రూ. 3,097 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ ఇన్వెస్టర్లకు 1:1 బోనస్ వాటాలను ఇవ్వాలని నిర్ణయించినట్టు ఇన్ఫీ ఈ సందర్భంగా ప్రకటించింది. అందుకోసం రూ. 5 ముఖ విలువగల 57,42,36,166 ఈక్విటీ వాటాలను కేటాయించినట్టు తెలియజేసింది. బోనస్ డేట్ గత సంవత్సరం డిసెంబర్ 3గా బోర్డు డైరెక్టర్లు నిశ్చయించినట్టు పేర్కొంది. విదేశీ మారకద్రవ్య మార్పులు సంస్థ గణాంకాలపై ప్రభావం చూపాయని ఇన్ఫీ అభిప్రాయపడింది. మార్చి 2016తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ ఆదాయవృద్ధి 6.2 శాతం నుంచి 8.2 శాతం వరకూ ఉండవచ్చని అంచనా వేసింది. అమెరికాకు చెందిన డిజైన్ సంస్థ కలిడస్ ను 120 మిలియన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని తెలిపింది. కాగా, ఈ ఫలితాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను హరించివేశాయి. మధ్యాహ్నం 3:15 గంటల సమయంలో ఇన్ఫోసిస్ ఈక్విటీ విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 5.70 శాతం పడిపోయి రూ. 2001 వద్ద కొనసాగుతోంది.