: పార్టీ ప్లీనరీ ప్రసంగంలో కాంగ్రెస్, టీడీపీలపై కేసీఆర్ విమర్శలు


టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశం తొలిరోజు ప్రసంగంలో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఎప్పుడూ కాంగ్రెస్, టీడీపీలే తెలంగాణను పాలించాయన్నారు. వారి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నేతలు పేదల గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. తమ (టీఆర్ఎస్) పాలన చూసి కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని ఎద్దేవా చేశారు. గత పాలకులు బీడీ కార్మికులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అన్న కేసీఆర్, వారికి రూ.వెయ్యి పింఛన్ ఇచ్చిన ఘనత తమదేనని పునరుద్ఘాటించారు. పాలన సక్రమంగా చేస్తుంటే విమర్శిస్తున్నారని, ఇది సరికాదని సూచించారు. మాటలు చెప్పడం, మోసం చేయడమే కాంగ్రెస్ నేతల పని అని టీఆర్ఎస్ అధినేత వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేతలు ప్రతిసారి ఎన్నికలకు ముందే పథకాలు తీసుకొస్తారన్న కేసీఆర్, గతేడాది ఎన్నికలకు మూడు నెలల ముందు బంగారు తల్లి పథకం తెచ్చారని, కొన్ని రోజులకే అది అడ్రస్ లేకుండా పోయిందని విమర్శించారు. ఇక తాజాగా మహబూబ్ నగర్ లో పర్యటించిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. నిన్నొకరు పాలమూరుకు వచ్చి హైదరాబాదు తన వల్లే అభివృద్ధి అయిందని, హైటెక్ సిటీ తానే తీసుకొచ్చానని చెబుతున్నారన్నారు. ఇకనుంచి ఇలాంటి మాటలు కుదరవన్నారు. తెలంగాణలో మొదట్లో కరెంటు కోతలు ఉన్నప్పుడు, కోతలు ఎత్తివేయాలని వాటికి కారణమైనవారే డిమాండ్ చేయడం హాస్యాస్పదమని కాంగ్రెస్, టీడీపీలపై వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News