: టీఆర్ఎస్ కార్యకర్తల త్యాగఫలమే తెలంగాణ: సీఎం కేసీఆర్
తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అన్నారు. వారి త్యాగఫలమే నేటి తెలంగాణ అని చెప్పారు. కార్యకర్తలు ఏనాడు వెనకడుగు వేయలేదని, జెండా కింద పెట్టకుండా విజయం సాధించేదాకా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడిన ఘనత వారిదేనని ప్రశంసించారు. హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న పార్టీ ప్లీనరీ తొలిరోజు సమావేశాల్లో కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, తెలంగాణ సంస్కృతికి పునర్ వైభవం తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని కేసీఆర్ చెప్పారు. ప్రపంచం అబ్బురపడేలా రూ.5 కోట్లతో కొమురం భీమ్ విగ్రహ నిర్మాణం జరుగుతోందని ప్రకటించారు. పీవీ నరసింహారావు జాతి గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. యాదగిరిగుట్టను దివ్యక్షేత్రంగా తిర్చిదిద్దుతున్నామని, కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.