: సర్కారీ భూములను పప్పు బెల్లాల్లా పంచిపెట్టారట... ఏపీలో ఐఏఎస్ పై సస్పెన్షన్ వేటు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న యువ ఐఏఎస్ అధికారి శ్రీధర్ ను సస్పెండ్ చేసింది. ప్రస్తుతం వెయిటింగ్ లో ఉన్న ఆయనను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భూ బదలాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టు ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన సమయంలో తిరుపతి నగర పరిసరాల్లోని సర్కారీ భూములను ఆయన నిబంధనలకు విరుద్ధంగా ధారాదత్తం చేశారని ప్రభుత్వం తేల్చింది. తిరుపతి పరిసరాల్లోని దాదాపు 105 ఎకరాల భూములను శ్రీధర్ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేశారట. దీంతో ఆయనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. శ్రీధర్ పై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వ అనుమతితో కలెక్టర్ సమగ్ర విచారణ చేయించారు. విచారణలో శ్రీధర్ అక్రమాలకు పాల్పడ్టట్లు తేలింది. దీంతో చాలా కాలంగా పోస్టింగ్ ఇవ్వకుండా ఆయనను వెయిటింగ్ లో పెట్టిన ప్రభుత్వం, నిన్న సాయంత్రం ఉన్నపళంగా ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు ప్రకటించింది. యువ ఐఏఎస్ అధికారి సస్పెండ్ కావడం ఏపీలోని అధికార యంత్రాంగాన్ని కలవరపాటుకు గురి చేసింది.