: బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వివాదాస్పద నిర్ణయం
బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. స్వతహాగా న్యాయవాది అయిన ఆయన వివిధ సందర్భాల్లో వివాదాస్పదంగా వ్యవహరిస్తారని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తాయి. ప్రస్తుతం అలాగే, అత్యాచారం సహా పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపు తరపున వాదించనున్నట్టు ఆయన తెలిపారు. ఆశారాం బాపుపై ఉన్న అభియోగాల తీవ్రత దృష్ట్యా ఆయనకు ఇప్పటి వరకు బెయిల్ కూడా లభించలేదు. ఆశారాం బాపు కేసును వాదిస్తానని, బెయిల్ పొందడం ఆయన ప్రాథమిక హక్కు అని ఆయన పేర్కొన్నారు. లాలూప్రసాద్ యాదవ్, జయలలిత వంటి వారు బెయిల్ పొందినప్పుడు, ఆశారాం బాపు ఎందుకు బెయిల్ పొందకూడదని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. స్వచ్చందంగా కేసు వాదిస్తానని సుబ్రమణ్యస్వామి ముందుకు రావడంతో, తనకు బెయిల్ లభిస్తుందని ఆశారాం బాపు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.