: అది నా పూర్వజన్మ సుకృతం: పాలమూరు సభలో చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కార్యకర్తలను ఆకాశానికెత్తేశారు. సామాజిక న్యాయం కలిగి ఉన్న పార్టీ టీడీపీ అని, ఉక్కుసంకల్పంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు పార్టీ సొంతమని అన్నారు. ఇలాంటి కార్యకర్తలు దేశంలో మరే పార్టీకి లేరని గర్వంగా చెప్పారు. ఈ ఉదయం 11 గంటలకు మహబూబ్ నగర్ వచ్చానని, తాను వచ్చినప్పటి నుంచి ఒక్క కార్యకర్త కూడా కదల్లేదని, ఓవైపు ఎండ మండిపోయిందని, కాసేపట్లో వర్షం వచ్చే అవకాశం ఉందని, ఎండ, వాన కూడా టీడీపీ కార్యకర్తలను చూసి భయపడ్డాయని అన్నారు. ఇలాంటి కార్యకర్తలున్న పార్టీకి అధ్యక్షుడిగా ఉండడం తన పూర్వజన్మ సుకృతమని కొనియాడారు. తెలంగాణలో టీడీపీని దెబ్బదీసేందుకు యత్నాలు జరుగుతున్నాయని, నేతలు వెళ్లిపోయినా, కార్యకర్తలు మాత్రం అండగా నిలిచారని కొనియాడారు.