: బీఫ్ బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో కాల్పులు జరిపిన యువతి
అమెరికాలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న తుపాకీ సంస్కృతి ప్రజల ప్రాణాలు హరిస్తోంది. ఆర్డరిచ్చిన బర్గర్ ఇవ్వలేదన్న కోపంతో వెయిటర్ పై కాల్పులు జరిపిందో మహిళ. తర్వాత చేసిన నేరానికి గాను జైలుకి వెళ్ళింది. ఆ వివరాల్లోకి వెళితే, అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలోని గ్రాండ్ ర్యాపిడ్స్ పట్టణంలో గత మార్చిలో మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్ కు షనేకా మోనిక్ టోరెస్ (30) తన స్నేహితురాలితో కలిసి వెళ్లింది. తినేందుకు బీఫ్ బర్గర్ ఆర్డరిచ్చింది. అక్కడి వెయిటర్ ఆమె చెప్పింది సరిగ్గా విన్నాడో లేదో కానీ, ఆమెకు మామూలు బర్గర్ తెచ్చి ఇచ్చాడు. దీంతో ఆగ్రహించిన టోరెస్ అతనితో వాగ్వాదానికి దిగింది. దీంతో రంగప్రవేశం చేసిన రెస్టారెంట్ మేనేజర్ ఆమెకు క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలికాడు. ఇది జరిగిన కొన్ని గంటల తరువాత అమె మళ్లీ అదే రెస్టారెంట్ కి వెళ్లి మరో బీఫ్ బర్గర్ ఆర్డర్ చేసింది. ఈసారి కూడా వెయిటర్ ఆమెకు మామూలు బర్గర్ ఇచ్చాడు. దీంతో మండిపడిన టోరెస్ జేబులో ఉన్న హ్యాండ్ గన్ తీసి ఒక రౌండ్ కాల్పులు జరిపి వెళ్లిపోయింది. అయితే, బుల్లెట్ గురి తప్పడంతో వెయిటర్ అదృష్టవశాత్తూ గాయపడలేదు. దీంతో రెస్టారెంట్ యజమాని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని న్యాయస్థానంలో హజరుపరచగా, ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.