: ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్యపై లోక్ సభలో గందరగోళం... చర్చ చేపట్టాలంటూ విపక్షాల డిమాండ్
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమ్ ఆద్మీ పార్టీ నిన్న(బుధవారం) నిర్వహించిన ర్యాలీలో గజేంద్ర సింగ్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై లోక్ సభలో గందరగోళం చెలరేగింది. ప్రశ్నోత్తరాలు రద్దుచేసి ఈ ఘటనపై చర్చ చేపట్టాలంటూ విపక్షాలు కోరగా స్పీకర్ సుమిత్రా మహాజన్ నిరాకరించారు. 12 గంటలకు చర్చకు అనుమతిస్తామని తెలిపారు. వినిపించుకోని విపక్ష సభ్యులు చర్చ జరపాల్సిందేనంటూ డిమాండ్ చేస్తూ నినాదాలు చేస్తున్నారు. రైతు ఆత్మహత్యపై విస్తృత చర్చ జరపాలని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ క్రమంలో స్పీకర్ సభ్యులను పలుమార్లు వారించారు. అయినా వినని విపక్షాలు ప్రస్తుతం లోక్ సభలో తమదైన శైలిలో నినాదాలు చేస్తూ, నిరసన వ్యక్తం చేస్తున్నారు.