: వాణిజ్య ప్రకటన వివాదంలో ఐశ్వర్యా రాయ్!
మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్ ఓ వివాదంలో చిక్కుకుంది. ఆమె నటించిన ఓ జ్యువెల్లరీ యాడ్ పై బాలల హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఐష్ నటించిన ఓ యాడ్ లో నగలతో ఠీవీగా సోఫాపై ఆమె కూర్చుని ఉండగా, వెనుకే ఆమెకు ఓ చిన్నారి గొడుగు పట్టుకున్నట్లున్న వైనంపై బాలల హక్కుల సంఘాలు మండిపడ్డాయి. ఇదేనా, మీరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇచ్చే ప్రాధాన్యత? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. సదరు యాడ్ ద్వారా బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ నిందలేసే యత్నం చేశాయి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్ పర్సన్ నేతృత్వంలోని ఓ బృందం దీనిని నిరసిస్తూ ఐష్ కు బహిరంగ లేఖ రాసింది. దీంతో సదరు యాడ్ ను చూసుకున్న ఐశ్వర్య, ఆ తర్వాత తప్పు తనది కాదని, సదరు యాడ్ సంస్థ చేసిన నిర్వాకమని ఆ బృందానికి సమాధానమిచ్చింది. ఇందుకోసం ఆమె ఓ ఫొటోను కూడా ఆ బృందానికి పంపింది. అసలు విషయమేమిటంటే, యాడ్ షూటింగ్ సందర్భంగా ఐష్ వెనుక చిన్నారి లేదట. షూటింగ్ తర్వాత ఐష్ కు చెప్పా పెట్టకుండానే సదరు జ్యువెల్లరీ సంస్థ గొడుగు పట్టుకున్న చిన్నారి ఫొటోను అందులో చేర్చిందట. అయినా ఈ విషయాన్ని జ్యువెల్లర్స్ దృష్టికి తీసుకెళతానని ఐశ్వర్య చెప్పడంతో బాలల హక్కుల సంఘాలు శాంతించాయి.