: చెన్నై ఆల్ రౌండ్ షో... బెంగళూరుకు హ్యాట్రిక్ ఓటమి!
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు హ్యాట్రిక్ సాధించింది. విజయాల్లో కాదు, పరాజయాల్లో! ఐపీఎల్-8లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని ఈ జట్టు, నిన్న చెన్నై చేతిలో ఓటమి చవిచూసి పరాజయాల్లో హ్యాట్రిక్ సాధించింది. ఇటు బ్యాటింగ్ లోనే కాక అటు బౌలింగ్ లోనూ సత్తా చాటిన చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో బెంగళూరు చిత్తుచిత్తుగా ఓడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ (4) నిరాశపరిచినా, మరో ఓపెనర్ డ్వేన్ స్మిత్ (39)తో కలిసి సురేశ్ రైనా(62) వీరవిహారం చేశాడు. ఆ తర్వాత డూప్లెసిస్ (33) కూడా తనవంతు బాధ్యత నెరవేర్చాడు. దీంతో చెన్నై 181 పరుగులు చేసింది. ఆ తర్వాత 182 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 154 పరుగులే చేయగలిగింది. హాఫ్ సెంచరీతో కెప్టెన్ విరాట్ కోహ్లీ (51) బ్యాట్ ఝుళిపించినా, మిగతా బ్యాట్స్ మన్ చేతులెత్తేశారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు 154 పరుగులు మాత్రమే చేసి హ్యాట్రిక్ పరాజయాన్ని మూటగట్టుకుంది. వరుసగా వికెట్లు తీసిన చెన్నై బౌలర్ ఆశిశ్ నెహ్రా కేవలం 2.5 ఓవర్లలో 10 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి, బెంగళూరు బ్యాటింగ్ లైనప్ ను దెబ్బతీశాడు.