: శతకం చేజార్చుకున్న వార్నర్... నైట్ రైడర్స్ టార్గెట్ 177 పరుగులు
సన్ రైజర్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాట్ ఝుళిపించాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో విశాఖపట్నంలో జరుగుతున్న మ్యాచ్ లో వార్నర్ 91 పరుగులు చేసి మోర్కెల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (54) కూడా రాణించడంతో సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. చివర్లో వికెట్ కీపర్ నమన్ ఓఝా 8 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఓఝా స్కోరులో ఓ ఫోర్, రెండు సిక్సులున్నాయి. నైట్ రైడర్స్ బౌలర్లలో మోర్కెల్ 2 వికెట్లు తీశాడు. ఉమేశ్ యాదవ్, ఆండ్రీ రసెల్ చెరో వికెట్ పడగొట్టారు.