: ఫలించని లోకేశ్ మంత్రాంగం... ఈ నెల 24న టీఆర్ఎస్ లోకి మంచిరెడ్డి
టీడీపీ ఎమ్మెల్యేల వలసలను నివారించేందుకు ఆ పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ నెరపిన మంత్రాంగం ఫలించలేదు. పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేందుకే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన విస్పష్ట ప్రకటన చేశారు. కొద్దిసేపటి క్రితం టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 24న కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరుతున్నానంటూ ఆయన ప్రకటించారు. కార్యకర్తలతో సుదీర్ఘ చర్చల అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నానని కూడా మంచిరెడ్డి వెల్లడించారు. టీడీపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. తాను పార్టీ మారిన తర్వాత ఎంతమంది టీడీపీని వీడతారన్న అంశం భవిష్యత్తులో తేలుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మంచిరెడ్డిని పార్టీ మారే విషయంలో నిలువరించేందుకు నిన్న రంగంలోకి దిగిన లోకేశ్, మంచిరెడ్డి కొడుకు ప్రశాంత్ రెడ్డిని పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. ‘‘మీ నాన్నను నీవైనా ఆపు. భవిష్యత్తులో మంచి అవకాశాలు రానున్నాయి’’ అంటూ లోకేశ్, ప్రశాంత్ కు సూచించారు. అయితే లోకేశ్ నెరపిన మంత్రాంగం ఏమాత్రం పనిచేయలేదని మంచిరెడ్డి ప్రకటనతో తేటతెల్లమైంది.