: నా విజయంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్ర... ట్రైనీ ఐఏఎస్ లకు క్లాస్ లో చంద్రబాబు
తాను సాధించిన విజయాల్లో ఐఏఎస్ అధికారులదే కీలక భూమిక అని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి అకాడెమీ ఆప్ అడ్మినిస్ట్రేషన్ లో ట్రైనీ ఐఏఎస్ లకు ఆయన ప్రత్యేక క్లాస్ తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని ఓ ముఖ్యమంత్రితోనూ ట్రైనీ ఐఏఎస్ లకు శిక్షణ ఇప్పించాలని అధికారులు నిర్ణయించారు. ఎవరి క్లాస్ వింటారో మీరే తేల్చుకోండన్న అధికారుల సూచనతో ట్రైనీ ఐఏఎస్ లు ముక్త కంఠంతో చంద్రబాబును ఎంచుకున్నారు. ఈ మేరకు అందిన ఆహ్వానంతో నిన్న చంద్రబాబు ముస్సోరి వెళ్లారు. ట్రైనీ ఐఏఎస్ లకు సుదీర్ఘంగా పాఠాలు చెప్పారు. ఇందులో భాగంగా ఐఏఎస్ లు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ లుగా కాకుండా అభివృద్ధి మేనేజర్లుగా పనిచేయాలని ఆయన సూచించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి తొమ్మిదేళ్లకు పైగా సీఎంగా పనిచేసిన సందర్భంలో తాను చేసిన అభివృద్ధిలో ఐఏఎస్ అధికారులు కీలక భూమిక పోషించారని ఆయన చెప్పారు. అభివృద్ధి మంత్రం జపించినప్పుడే ప్రజలకు దగ్గరవుతారని కూడా ఆయన భావి ఐఏఎస్ లకు ఉద్బోధించారు. చంద్రబాబు పాఠాలను ట్రైనీ ఐఏఎస్ లు ఆసక్తిగా విన్నారట.