: సూపర్ ఓవర్ లో సత్తా చాటిన ‘కింగ్స్’... రాజస్థాన్ పై పగ తీర్చుకున్న సెహ్వాగ్ సేన!
ఐపీఎల్-8లో నిన్నటి రాజస్థాన్, పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఇరు జట్లు సమాన స్కోరు చేయడంతో ఫలితం తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఓవర్ లో చూడచక్కటి షాట్లతో రాణించిన కింగ్స్ లెవెన్ పంజాబ్, రాజస్థాన్ పై విజయం సాధించింది. అంతేకాక తనపై ఇదే సిరీస్ లో నెగ్గిన రాజస్థాన్ పై పంజాబ్ పగ తీర్చుకున్నట్లైంది. అహ్మదాబాదులోని మోతేరా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుని రాజస్థాన్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన అజింక్యా రెహానే (74), షేన్ వాట్సన్ (45) రాణించడంతో జట్టు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఆ తర్వాత కరుణ్ నాయర్ (25) మినహా మిగిలిన బ్యాట్స్ మన్ వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో 200 పరుగులు దాటుతుందనుకున్న స్కోరు, 191కే పరిమితమైంది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. వీరేంద్ర సెహ్వాగ్ అనవసరంగా రనౌట్ కావడంతో ఓ దశలో జట్టుకు పరాజయం తప్పేలా లేదన్న భావన కలిగింది. అయితే షాన్ మార్ష్ (65), డేవిడ్ మిల్లర్ (54)లు రాణించడంతో పంజాబ్ 191 పరుగులు చేసింది. ఇరు జట్లు సమంగా రాణించడంతో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. తొలుత ఆరు బంతులను ఎదుర్కొన్న పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆరు బంతుల్లో 16 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నాలుగు బంతుల్లోనే రెండు వికెట్లు చేజార్చుకుని కేవలం 6 పరుగులు చేసింది. దీంతో పంజాబ్ జట్టు, రాజస్థాన్ పై విజయం సాధించింది.