: యూపీలో ఉద్యోగమైతే ఎంత హాయో!... పనిదినాలు ఆరు నెలలే
ఉత్తరప్రదేశ్ లో ఎందుకు పుట్టలేదా? అని ఉద్యోగులు, విద్యార్థులు అనుకోవాలేమో! ఎందుకంటే, ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు సెలవు రాజకీయాలు నడిపిస్తున్నాయి. ఇప్పటికే దేశంలోనే అత్యధిక సెలవులు ఇస్తున్న రాష్ట్రంగా ఉన్న యూపీ, మరిన్ని రోజులను సెలవు దినాల్లో చేర్చింది. దీంతో ఇకపై ఉద్యోగులు ఆరు నెలలు సెలవులు అనుభవించి, ఆరు నెలలు పనిచేస్తే చాలు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఉద్యోగ వర్గాల మెప్పుకోసం అఖిలేష్ యాదవ్ మరో మూడు సెలవులను అదనంగా కలిపారు. మాజీ ప్రధానమంత్రులు చరణ్ సింగ్, చంద్రశేఖర్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ ల జయంతి ఉత్సవాలను సెలవులుగా నిర్ణయించారు. వీరందరి జన్మదినోత్సవాలను జరుపుకోవడం వల్ల ప్రజలు వీరిని ఆదర్శంగా తీసుకోగలుగుతారని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఇప్పుడు యూపీలో సెలవుల జాబితా 38కి పెరిగింది. ఇప్పటికే వారంలో ఐదు రోజుల పాటు మాత్రమే పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎల్, ఈఎల్, పండగ సెలవులు తదితరాలన్నీ కలిపితే వారు పనిచేసే కాలం ఆరు నెలలకు తగ్గుతుంది. అదీ సంగతి మరి. కాగా, ప్రతి నేత పుట్టినరోజును సెలవుగా ఇస్తున్నారని ఆరోపిస్తూ లక్నో న్యాయస్థానంలో ఒక పిటిషన్ దాఖలైంది. సెలవులను నియంత్రించాలని కూడా పిటిషనర్ అమితాబ్ థాకూర్ కోర్టును అభ్యర్థించారు. ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించింది.