: హైదరాబాదులో రూటు మార్చిన అమ్మాయిల అక్రమ రవాణాదారులు


హైదరాబాదు కేంద్రంగా అమ్మాయిలను అమ్మేసే ట్రాఫికర్లు ఇప్పుడు కొత్త పంథా ఎంచుకున్నారు. జాబ్ వీసాల సాయంతో అమ్మాయిలను గల్ఫ్ దేశాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ఇప్పటివరకు పశ్చిమాసియా దేశాలకు చెందిన వ్యక్తులు హైదరాబాదుకు రావడం ఇక్కడి అమ్మాయిలను స్వల్ప కాల ఒప్పందం పేరిట పెళ్లి చేసుకుని, కొద్ది కాలానికే వారిని వదిలేయడం జరుగుతుండేది. ఈ పెళ్లి తంతు జరిపేందుకు ఖాజీల్లా కొందరు అవతారమెత్తి పబ్బం గడుపుకునేవారు. ట్రాఫికర్ల సంగతి సరేసరి. అయితే, స్వచ్ఛంద సంస్థల పుణ్యమాని ఇలాంటి వ్యవహారాలపై పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. కేసులు పెరగడంతో ట్రాఫికర్లు, నకిలీ అరబ్ షేకులు వెనుకంజ వేశారు. ఇలాగైతే పని కాదనుకుని, జాబ్ వీసాల సాయంతో అమ్మాయిలనే నేరుగా గల్ఫ్ దేశాలకే పంపాలని కొత్త పథకానికి తెరదీశారు. ఉద్యోగాలిప్పిస్తామని నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు ఎరవేయడం, వారిని అరబ్ దేశాలకు తరలించడం... ఇదీ ట్రాఫికర్ల తాజా పన్నాగం. దీనిపై హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు మాట్లాడుతూ... ఏజెంట్లు హైదరాబాదులో మకాం వేసి 'కన్య'లను తరలించే పనిలో ఉంటారని, వారి బాస్ ముంబయి నుంచి వ్యవహారం నడిపిస్తుంటే, మరికొందరు పశ్చిమాసియా దేశాల్లో ఉండి పని చక్కబెడుతుంటారని వివరించారు. ఇలా దేశం దాటించిన అమ్మాయిలపై లైంగిక వేధింపులు, వెట్టి చాకిరీ సర్వసాధారణమని తెలిపారు. అమ్మాయిల అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ చెప్పారు.

  • Loading...

More Telugu News