: కొకైన్ కొనేందుకు గోల్డ్ మెడల్ అమ్మిన బ్రెజిల్ సాకర్ ఆటగాడు
లాటిన్ అమెరికా దేశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం చాలా ఎక్కువ. ప్రభుత్వాలు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా డ్రగ్స్ మాఫియా తన పని తాను చేసుకుపోతుంటుంది. ఈ మత్తు పదార్థాలకు బానిసై యువత పెడదారి పడుతోంది. యువతీయువకులే కాదు, డ్రగ్స్ వాడకం కారణంగా కొందరు ప్రముఖులు కూడా తమ పేరుప్రతిష్ఠలకు మచ్చ తెచ్చుకుంటున్నారు. తాజాగా, బ్రెజిల్ ఫుట్ బాల్ మాజీ ఆటగాడు పావ్లో సీజర్ (65) కొకైన్ కొనేందుకు వరల్డ్ కప్ గోల్డ్ మెడల్ ను అమ్మేసిన విషయం వెల్లడైంది. ఓ టీవీ చానల్ తో మాట్లాడుతూ సీజర్ ఈ విషయం తెలిపాడు. ఈ విషయం ఇంతవరకు ఎవరికీ చెప్పలేదని, ఇది వ్యక్తిగతంగా తీరని నష్టమని పేర్కొన్నాడు. 1970లో ఫిఫా వరల్డ్ కప్ నెగ్గిన బ్రెజిల్ జట్టులో సీజర్ కూడా ఉన్నాడు. ఫ్రాన్స్ క్లబ్ పోటీల్లో మార్సెలీ జట్టు తరపున ఆడే కాలంలో ఈ బ్రెజిలియన్ డ్రగ్స్ వాడకం మొదలు పెట్టాడు. మెడల్ అమ్మకం గురించి చెబుతూ, ఆనాడు తనకు కొకైన్ కంటే ఏదీ ముఖ్యమని అనిపించలేదని, వరల్డ్ కప్ లో దక్కిన బంగారు పతకం కూడా మాదకద్రవ్యం కంటే తక్కువేనని భావించానని తెలిపాడు. దాదాపు పదిహేడేళ్ల పాటు డ్రగ్స్, ఆల్కహాల్ కు బానిసైన తాను, వ్యసనాల కారణంగా రియో డి జనీరోలో మూడు అపార్ట్ మెంట్లను కోల్పోయానని చెప్పుకొచ్చాడు. ఆనాటి వరల్డ్ కప్ లో ఇటలీతో జరిగిన ఫైనల్లో సీజర్ సబ్ స్టిట్యూట్ గా బెంచికే పరిమితమయ్యాడు.