: చదలవాడా... అందుబాటులో ఉండు!: ఏపీ సీఎం చంద్రబాబు
తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత చదలవాడ కృష్ణమూర్తి కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. హైదరాబాదులోని చంద్రబాబు నివాసానికి వచ్చిన ఆయన తిరుపతి తిరుమల దేవస్థానం(టీటీడీ) పాలకమండలిపై చంద్రబాబుతో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా తనకు అందుబాటులో ఉండాలని చదలవాడకు చంద్రబాబు సూచించారట. దీంతో నేడో, రేపో టీడీపీ పాలక మండలిని ప్రకటించనున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీటీడీ చైర్మన్ పదవిపై హామీతోనే మొన్నటి ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ సీటును చదలవాడ, దివంగత నేత వెంకటరమణకు వదిలేసుకున్నారు. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్ పదవిని గతంలో ఇచ్చిన హామీ మేరకు చదలవాడకే ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయించినట్లు సమాచారం. పాలక మండలి సభ్యులపైనా ఇప్పటికే కసరత్తు పూర్తైనా, ఒకరిద్దరి పేర్లు మారే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.