: రస్సెల్ సంచలన ఇన్నింగ్స్... పంజాబ్ పై గెలిచిన నైట్ రైడర్స్!
వెస్టిండిస్ ఆల్ రౌండర్ ఆండ్రూ రస్సెల్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా బోల్తా పడుతుందనుకున్న కోల్ కతా నైటర్ రైడర్స్ అనూహ్య విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ పై నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో లక్ష్యం 156 పరుగులే అయినప్పటికీ, ఆ జట్టు స్టార్ ప్లేయర్లు రాబిన్ ఊతప్ప(13), గౌతం గంబీర్(11), మనీష్ పాండే(12), యూసుఫ్ పఠాన్(28) స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరడంతో నైట్ రైడర్స్ కు పరాజయం తప్పదని భావించారు. అయితే రస్సెన్(66) సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అప్పటికే ఐదు కీలక వికెట్లు కోల్పోయి పరాజయం బాట పట్టిన జట్టుకు రస్సెల్ ఊపిరి పోశాడు. ఫిప్త్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన రస్సెల్, పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 36 బంతులను ఎదుర్కొన్న రస్సెల్ ఏకంగా 66 పరుగులు రాబట్టాడు. దీంతో ఓటమి తప్పదనుకున్న నైట్ రైడర్స్ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఆరు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. పంజాబ్ పై నాలుగు వికెట్ల తేడాతో అనూహ్య విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి తొలి బ్యాటింగ్ చేసిన పంజాబ్, నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి గాను 155 పరుగులు సాధించింది.