: చైనాతో కలసి పరుగు: చంద్రబాబు
అభివృద్ధి విషయంలో చైనాను ఆదర్శంగా తీసుకొని ముందడుగు వేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సుదీర్ఘ చైనా పర్యటనను ముగించుకుని వచ్చిన ఆయన ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడారు. సాంకేతికతతో పాటు, వేగం, నైపుణ్యత చైనా ప్రత్యేకతగా ఆయన అభివర్ణించారు. ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పలు చైనా కంపెనీలు ముందుకు వచ్చాయని వివరించారు. వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు తాను కూడా అంగీకరించానని, వారు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకూ సమాధానం ఇచ్చానని పేర్కొన్నారు. చైనాతో కలిస్తే, వృద్ధి బాటలో భారత్ పరుగులు పెడుతుందని అన్నారు. భూసేకరణ, సమీకరణ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఆ దేశంలో తనకు సాదర స్వాగతం లభించిందని చెప్పిన ఆయన తనకు ఆతిధ్యం ఇచ్చిన వారిని పేరుపేరునా గుర్తు చేసుకున్నారు.