: సల్మాన్ కేసులో తీర్పు తేదీపై ఈ నెల 20న కోర్టు నిర్ణయం
పదమూడేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో తీర్పు వెల్లడించేందుకు ముంబయి ట్రయల్ కోర్టు సిద్ధమైంది. ఈ కేసులో తుది తీర్పు వెల్లడించే తేదీని ఈ నెల 20న నిర్ణయించనున్నట్టు తెలిపింది. అయితే కేసులో తమకు మరింత సమయం కావాలని కోరిన సల్మాన్ తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. "జడ్జిమెంట్ తేదీని సోమవారం నాడు నిర్ణయిస్తాను" అని కోర్టు జడ్జి డీడబ్ల్యూ దేశ్ పాండ్ చెప్పారు. ఆ రోజులోగా మీ వాదనలు ముగించాలని, అదనపు సమయం ఇచ్చేది లేదని సల్మాన్ తరపు న్యాయవాదికి జడ్జి స్పష్టం చేశారు. ఈ కేసులో ప్రాషిక్యూషన్ తరపున మొత్తం 27 మంది సాక్షులను విచారించగా, డిఫెన్స్ తరపున సల్మాన్ డ్రైవర్ అశోక్ సింగ్ ఒకడినే విచారించారు.