: కాంగ్రెస్ చేయకపోతే... మీరు చెయ్యొచ్చుగా?: వెంకయ్యనాయుడుకు సూటి ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధించడంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పూర్తిగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాను పునర్విభజన బిల్లులో కాంగ్రెస్ పార్టీ పెట్టలేదని పదే పదే వెంకయ్యనాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు సరే, అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే కదా? లోక్ సభలో పూర్తి మెజారిటీ ఉంది కదా? దేశంలోని పార్టీలన్నీ విభజనకు మద్దతిచ్చాయి కదా? సాక్షాత్తూ ప్రధాని రాజ్యసభలో ప్రకటన చేశారు కదా? అలాంటప్పుడు ప్రత్యేక హోదా ఎన్డీయే ఎందుకు ఇవ్వకూడదని నిలదీశారు. పోనీ విభజన చట్టంలో ప్రత్యేక హోదా లేనప్పుడు ప్రధాని ప్రకటన చేస్తే బీజేపీ ఎందుకు అంగీకరించిందని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీల నేతలు ముందు రెండు నాల్కల ధోరణి అరికట్టాలని ఆయన సూచించారు. ప్రత్యేకహోదాపై ఉద్యమం చేసేందుకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా మే 14న ఆందోళన చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. కేవలం ఎర్రచందనం స్మగ్లర్లను కాపాడేందుకే కూలీలను ఎన్ కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు.