: జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాలు ఎలా ఇస్తారు?: మల్లాది విష్ణు
అటవీ శాఖ భూమిని నాశనం చేసి, జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాలను ఎలా ధారాదత్తం చేస్తారని కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఏకపక్ష అధికారం అప్పగించారనే అహంకారంతో ప్రజలను మభ్యపెడుతూ, సహజ సంపదను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. కేవలం ఒకరోజు ఎమ్మెల్యేలకు యోగా పాఠాలు చెప్పాడనే కారణంతో, ఈషా ఫౌండేషన్ అధిపతి జగ్గీవాసుదేవ్ కు 400 ఎకరాల అటవీభూమిని ప్రభుత్వం కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సహజ సంపదను నాశనం చేసి, యోగా పాఠాలు చెప్పేందుకు 400 ఎకరాల అటవీ భూమా? అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తూ, పెద్దలకు కట్టబెట్టడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు ఏమీ అనరనే ధైర్యం, పరిశ్రమలు అంటూ మభ్యపెట్టి టీడీపీ ప్రభుత్వం అరాచకాలకు తెరతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన అన్నారు.