: దుమ్మురేపిన రిలయన్స్!
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అంచనాలు మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించి దుమ్మురేపింది. 2014-15 ఆర్థిక సంవత్సరం జనవరి -మార్చి మధ్య కాలంలో సంస్థ నికరలాభం 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2013-14లో రూ. 5,881 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించిన సంస్థ ఈ ఏడు రూ. 6,381 కోట్లకు లాభాలను పెంచుకుంది. రిఫైనరీ విభాగంలో గడచిన రెండేళ్లలోనే అత్యధికంగా బ్యారెల్ కు 10.1 డాలర్ల (సుమారు రూ. 685) మార్జిన్ రావడం సంస్థ లాభాలపై ప్రభావం చూపింది. ఈ ఫలితాలు తమకు సంతృప్తినిచ్చాయని, ఈ సందర్భంగా ఒక్కో ఈక్విటీ వాటాకు రూ. 10 డివిడెండ్ గా ఇచ్చేందుకు బోర్డు డైరెక్టర్లు ప్రతిపాదించారని సంస్థ ప్రకటించింది. కాగా, ఈ మూడు నెలల కాలంలో మొత్తం టర్నోవర్ 33.3 శాతం పెరిగి రూ. 70,868 కోట్ల నుంచి రూ. 1,06,208 కోట్ల రూపాయలకు పెరిగింది. అంతకుముందు సంస్థ నికర ఆదాయం రూ. 64,455 కోట్లకు చేరవచ్చని 16 మంది ప్రముఖ విశ్లేషకులు అంచనా వేశారు. ఫలితాల విడుదల సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ స్పందిస్తూ, "2014-15 ఆర్థిక సంవత్సరం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు ఎంతో ముఖ్యమైన, విజయవంతమైన సంవత్సరం. ప్రపంచవ్యాప్తంగా ఒకవైపు క్రూడాయిల్ ధరలు పతనం అవుతూ, మరోవైపు హైడ్రోకార్బన్ మార్కెట్ అనిశ్చితిలో సాగుతుంటే, మా చమురు శుద్ధి వ్యాపారం రికార్డు స్థాయి రాబడిని ఇచ్చింది" అని అన్నారు.