: కేసీఆర్ కాన్వాయ్ వస్తే నడిచి వెళ్లాల్సిందేనట...మంత్రి చందూలాల్, ఐఏఎస్ లకు అవమానం!
తెలంగాణ సీఎం కేసీఆర్ డాబూ దర్పం నానాటికీ పెరిగిపోతున్నాయి. దీంతో పలుమార్లు సీనియర్ అధికారులు సహా మంత్రులు కూడా నానా పాట్లు పడాల్సి వస్తోంది. మొన్నిటికి మొన్న సీఎం క్యాంపు ఆఫీస్ లోకి వెళ్తున్న ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఐడీ కార్డు చూపమన్న ఆయన సెక్యూరిటీ సిబ్బంది, తాజాగా సీఎం కాన్వాయ్ వచ్చే సమయంలో ఆ పరిసరాల్లో ఎవరూ కార్లలో వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. ఈ తరహా ఆదేశాలను కేసీఆర్ జారీ చేస్తున్నారో, లేదో తెలియదు కాని, ఆయన సెక్యూరిటీ సిబ్బంది మాత్రం మితిమీరిపోతున్నారు. వివరాల్లోకెళితే... కొద్దిసేపటి క్రితం హుసేన్ సాగర్ పరిసరాల్లోని మారియట్ హోటల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొదలైంది. ఈ సమావేశానికి పది జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు, ఆయా శాఖల సీనియర్ ఐఏఎస్ అధికారులూ హాజరయ్యారు. సరిగ్గా సీఎం కాన్వాయ్ వస్తున్న సమయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అక్కడికి చేరుకున్నారు. మంత్రి కారును గేటు బయటే నిలిపేసిన సెక్యూరిటీ సిబ్బంది, నడిచి వెళ్లాల్సిందేనంటూ చెప్పేశారు. మరికాసేపటికే మాటమార్చిన సెక్యూరిటీ సిబ్బంది, సీఎం వచ్చేశారు... నడుచుకుంటూ వెళ్లేందుకూ వీల్లేదంటూ ఆయనను నిలిపేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హోం శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటేశంను కూడా సెక్యూరిటీ సిబ్బంది ఆపేశారు.