: హైదరాబాదులో యువతిపై ప్రేమోన్మాది దాడి...యువతి తండ్రి చేతిలో ప్రేమోన్మాది హతం!
హైదరాబాదులోని కూకట్ పల్లి పరిధిలోని ఐడీఎల్ లో నేటి ఉదయం దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదన్న కారణంగా రాజు అనే ప్రేమోన్మాది ఓ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత యువతి తండ్రి చేసిన ప్రతిదాడిలో ఆ ప్రేమోన్మాది అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. కలకలం రేపిన ఈ ఘటనలో ప్రేమోన్మాది దాడిలో గాయపడ్డ యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కొంతకాలంగా తనను ప్రేమించాలని రాజు బాధితురాలి వెంట పడుతున్నాడు. అతడి ప్రేమను యువతి అంగీకరించలేదు. ఈ క్రమంలో యువతికి కుదిరిన పెళ్లి సంబంధాలను కూడా రాజు చెడగొట్టాడట. నేటి ఉదయం పేట్రేగిపోయిన రాజు కత్తి చేతబట్టి యువతిపై విరుచుకుపడ్డాడు. అతడి దాడిలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. కూతురు పరిస్థితి చూసి చలించిపోయిన బాధితురాలి తండ్రి చేసిన దాడిలో రాజు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.