: ‘మా’ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో... సినీవర్గాల్లో ఉత్కంఠ!


మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో వెల్లడి కానున్నాయి. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, జయసుధలు పోటీ పడ్డారు. రాజేంద్రప్రసాద్ ను మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు బలపరచగా, నటి జయసుధను ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ రంగంలోకి దింపారు. ఎన్నికల సమయంలో ఇరువర్గాలు మునుపెన్నడూ లేని విధంగా ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగి, రాజకీయ ఎన్నికలను మరిపించాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలు సవ్యంగా జరగలేదని ఆరోపిస్తూ నటుడు ఓ.కల్యాణ్ కోర్టుకెక్కారు. ఎన్నికల ఫలితాలను నిలిపివేసి, మరోమారు ఎన్నికలను నిర్వహించాలని ఆయన సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో పలుమార్లు ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మూడు రోజుల క్రితం కల్యాణ్ వాదనను తోసిపుచ్చుతూ ఎన్నికల ఫలితాల వెల్లడికి మార్గం సుగమం చేసింది. నేటి ఉదయం 10 గంటలకు మొదలుకానున్న ఎన్నికల కౌంటింగ్ కేవలం అరగంటలో ముగియనున్నట్లు ఎన్నికల పర్యవేక్షకుడు, నటుడు నారాయణరావు తెలిపారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్న అంశంపై సినీ పరిశ్రమలో ఉత్కంఠ నెలకొంది.

  • Loading...

More Telugu News