: హోండా మోటార్స్ అధినేతపై బంజారాహిల్స్ లో కేసు నమోదు!
ప్రపంచంలో టూ వీలర్స్ తో పాటు ఫోర్ వీలర్స్ తయారీలోనూ పేరెన్నికగన్న హోండా మోటార్స్ సంస్థ అధినేత కీతా మురమత్సుపై హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఒప్పందాన్ని ఉల్లంఘించి బైకుల రవాణాలో అధిక చార్జీలు వసూలు చేశారని ఆయనతో పాటు ఆ సంస్థకు చెందిన 14 మందిపై బంజారాహిల్స్ కు చెందిన డీవీఎస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ః విజయవాడలో కనకదుర్గ ఆటోమోబైల్స్ షోరూం కోసం డీలర్ షిప్ తీసుకున్న తనకు ఒక్కో వాహనాన్ని అందించేందుకు రూ.1,418 మాత్రమే హోండా మోటార్స్ వసూలు చేయాల్సి ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఒక్కో వాహనాన్ని విజయవాడకు తరలించేందుకు హోండా మోటార్స్ రూ.2,068 వసూలు చేసిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ విధంగా తన నుంచి రూ.45 వేలకు పైగా హోండా మోటార్స్ వసూలు చేసి మోసం చేసిందని డీవీఎస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. డీవీఎస్ రెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు మురమత్సు, మరో 14 మందిపై 420, 56(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.