: ముఠాకోరుల కూటమి... జనతా పరివార్: బీజేపీ నేత ఎమ్ జే అక్బర్
జనతా పరివార్ కూటమిపై బీజేపీ పరుష పదజాలంతో విరుచుకుపడింది. జనతా పరివార్ ప్రకటన వెలువడిన వెనువెంటనే, దానిపై బీజేపీ అధికార ప్రతినిధి, ప్రముఖ జర్నలిస్ట్ ఎమ్.జే. అక్బర్ ఘాటుగా స్పందించారు. జనతా పరివార్ ను ఆయన ముఠాకోరుల కూటమిగా అభివర్ణించారు. అంతేకాక బీహార్ ఎన్నికల తర్వాత జనతా పరివార్ అడ్రెస్ కూడా కనిపించదని వ్యాఖ్యానించారు. సున్నాతో సున్నా కలిస్తే సున్నానే వస్తుందన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను ప్రస్తావించిన అక్బర్, ‘‘జనతా పరివార్ తాత్కాలిక కూటమి. బీహార్ లో బీజేపీ, మోదీని ఎదుర్కొనడమే దీని లక్ష్యం. కూటమిలోని నేతలు... మంచి పరిపాలనను అందించేందుకు వచ్చిన అవకాశంగా కాక... వచ్చిన సీట్లు, పోయిన ఓట్లుగా ఎన్నికలను చూస్తున్నారు’’ అని ఆయన విమర్శించారు.