: కట్నం అడిగినందుకు 75 పైసల జరిమానా
కట్నం అడిగినందుకు హర్యానాలోని పంచాయతీ పెద్దలు 75 పైసల జరిమానా విధించారు. అసలు పంచాయతీ వ్యవస్థల పనితీరుపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్న ఈ ఘటన ఫతేహాబాద్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే, అడిగినంత కట్న కానుకలు ఇవ్వలేదన్న కోపంతో మగ పెళ్లివారు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోగా, వధువు తరపు బంధువులు పంచాయితీ పెట్టారు. పెళ్ళికి ముందు వరుడికి కారు ఇవ్వాలని డిమాండ్ చేయగా, అందుకు వధువు తరపు పెద్దలు అంగీకరించలేదు. రెండు వైపులా వాదనలు విన్న తరువాత మగ పెళ్లివారిదే తప్పని తేల్చిన పంచాయతీ పెద్దలు ఈ జరిమానా విధించారు. అంతే కాదు, ఆ 'డబ్బు'ను అనాజ్ మండిలోని శివాలయ ధర్మశాలకు విరాళంగా ఇవ్వాలని తీర్పిచ్చారు. "వారిది తప్పని నిరూపించాము, అదే చాలు" అని అమ్మాయి తరపు వారు చెప్పగా, "వధువు, వరుడి మధ్య వచ్చిన విభేదాల కారణంగానే పెళ్లి ఆగింది. మా మీద వచ్చిన ఆరోపణలు తప్పు" అని అబ్బాయి బంధువులు చెప్పారు.