: ఆండీస్ పర్వతాల నుంచి మస్తాన్ బాబు మృతదేహం కిందకు తరలింపు... త్వరలోనే స్వస్థలానికి!
పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు మృతదేహాన్ని ఆండీస్ పర్వతాల నుంచి ఎట్టకేలకు కిందకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అతని బాడీ ఉత్తర అర్జెంటినాలోని టుకుమాన్ టౌన్ లోని ఆసుపత్రిలో ఉండగా, విమానంలో భారత్ పంపేందుకు అవసరమైన ప్రక్రియను వైద్యులు చేస్తున్నారు. "ఈ విషయంలో అతని మృతదేహం కుళ్లిపోకుండా ఉండేందుకు చేసిన మొత్తం ప్రక్రియ మూడు రోజులు పట్టింది. ఈ వారం చివరలో అతని బాడీని భారత్ తీసుకురావచ్చు" అని హైదరాబాదులో మస్తాన్ బాబు సన్నిహితుడు సత్యం ఫోన్ లో టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు తెలిపాడు. కాగా అతని సోదరి మల్లి దొరసానమ్మ కూడా ఇప్పుడు అర్జెంటీనాలోనే ఉంది. గత నెలలో అదృశ్యమైన అతను పర్వతాల్లో చిక్కుకుని మరణించినట్టు ఈ నెల 3న కనుగొన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, అర్జెంటినా అధికారుల సమన్వయంతో ఐదు రోజుల కిందట ఐదుగురు నిపుణులైన పర్వతారోహకులు మస్తాన్ బాబు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు ఆండీస్ పర్వాల్లో ట్రెక్కింగ్ ప్రారంభించారు. వాళ్లకు అర్జెంటినా పోలీసు బృందం మరింత సాయం అందించింది. అయితే పర్వతాల్లో నెలకొన్న ప్రతికూల వాతావరణం కారణంగా అతని బాడీ ఎప్పటికప్పుడు పాడవుతూనే ఉందని, దాంతో ఆ పని వారికి అత్యంత సవాలుగా మారిందని సత్యం తెలిపారు. గత శుక్రవారం మస్తాన్ బాబు దేహాన్ని 5వేల మీటర్ల ఎత్తునుంచి కిందకు తీసుకురావడంలో పర్వతారోహకుల బృందం సఫలీకృతమైనట్టు 'ద అవుట్ జర్నల్'కు చెందిన జర్నలిస్టు సుప్రియా వోహా వివరించారు.