: ‘మా’ ఎన్నికలపై నేడు కోర్టు తీర్పు... సినీ వర్గాల్లో ఉత్కంఠ!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గ ఎన్నికల ఫలితాల వెల్లడిపై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రత్యక్ష రాజకీయ ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, జయసుధ పోటీ పడ్డారు. రెండు బలమైన వర్గాల మధ్య ప్రత్యక్ష పోరుకు ప్రతీకగా సాగిన ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, జయసుధకు మద్దతు తెలపగా... కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు, రాజేంద్ర ప్రసాద్ కు మద్దతు ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో నటుడు కల్యాణ్ కోర్టుకెక్కారు. ఈ వివాదంలో అన్ని వర్గాల వాదనలను మూడు రోజుల క్రితం పూర్తిగా విన్న కోర్టు, తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. నేటి మధ్యాహ్నంలోగా ‘మా’ ఎన్నికల ఫలితాల వెల్లడిపై కోర్టు తీర్పు వెలువడనుంది. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పుపై సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.