: తాళిబొట్టు బానిసత్వానికి చిహ్నమట... తెంచేసిన 25 మంది తమిళ మహిళలు!


హైందవ వైవాహిక వ్యవస్థలో తాళిబొట్టుకు ఓ విశిష్ట గుర్తింపు ఉంది. అయితే అదే తాళిబొట్టు బానిసత్వానికి చిహ్నమన్న సరికొత్త వాదన వెలుగు చూసింది. ఇదే వాదనతో తమిళ పార్టీ ద్రవిడ కజగం (డీకే) నిన్న చెన్నైలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏకంగా 25 మంది మహిళలు తమ మెడల్లోని తాళిబొట్లను తెంచేసి, తమ భర్తల చేతుల్లో పెట్టారు. అవమానానికి చిహ్నమైన తాళిని తెంచాక తనకు కాస్త ఉపశమనం కలిగిందని ఓ మహిళ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం గమనార్హం. డీకే పార్టీ నిర్వహించిన ఈ కార్యక్రమంపై సోమవారం నుంచి తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కార్యక్రమాన్ని నిలుపుదల చేయించేందుకు పన్నీర్ సెల్వం ప్రభుత్వం చేసిన యత్నాలు కాస్త ఆలస్యంగా ఫలించాయి. అప్పటికే 25 మంది మహిళలు తమ తాళిబొట్లను తెంచేశాక, కోర్టు ఆదేశాలతో పోలీసులు కార్యక్రమాన్ని నిలిపివేశారు. అయితే కార్యక్రమంలో భాగంగా జరగాల్సిన గొడ్డు మాంసం విందు మాత్రం జరగలేదు. సోమవారం అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు డీకే అధినేత వీరమణి కోర్టు అనుమతి సాధించారు. షెడ్యూల్ ప్రకారం ఈ కార్యక్రమం నిన్న ఉదయం 10 గంటలకు జరగాల్సి ఉంది. అయితే కార్యక్రమాన్ని నిలిపివేయాలన్న ప్రభుత్వ పిటిషన్ ను మంగళవారం ఉదయం 7 గంటలకు విచారిస్తామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం చెప్పడంతో వీరమణి కార్యక్రమాన్ని నిన్న ఉదయం 7 గంటలకు మార్చారు. కోర్టు తీర్పు వెలువడేలోగా 25 మంది మహిళలు తమ తాళిబొట్లను తెంచేశారు.

  • Loading...

More Telugu News