: అమెరికాను దాటే శక్తి మీకు, మాకే ఉంది: చైనాలో బాబు
భవిష్యత్తులో చైనా, ఇండియా దేశాలు అగ్రరాజ్యాలుగా అవతరించనున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. చైనాలో మూడవ రోజు పర్యటనలో భాగంగా ఇవాళ మధ్యాహ్నం ఆయన చైనా పెట్టుబడిదారులతో సమావేశం అయ్యారు. ఇండియాలో మోదీ ప్రభుత్వానికి ప్రజలు స్థిరమైన మెజారిటీని ఇచ్చారని వెల్లడించిన చంద్రబాబు అమెరికాను దాటే శక్తి మీకు, మాకే ఉందని ఆహూతుల కరతాళ ధ్వనుల మధ్య వెల్లడించారు. చైనా, భారత్ ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింతగా మెరుగుపడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ఇండియా సొంతమని, అతి త్వరలో రెండంకెల వృద్ధి రేటును సాధిస్తామని తెలిపారు. ఇండియాలోనే అతిపెద్ద తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ సొంతమని వెల్లడించిన ఆయన, డీప్ వాటర్ పోర్టులు ఉండటం ఏపీకి ఎంతో అనుకూలమని తెలిపారు. చైనా కంపెనీలు పెట్టుబడులతో రావాలని పిలుపునిచ్చారు.