: చెకిన్ క్యూ ఉండదు... కోరుకున్న సీటు, భోజనం... ఎయిర్ లైన్స్ కు ఎంత ఎక్కువ డబ్బిస్తే అన్ని సేవలు!
విమాన ప్రయాణికులకు మరిన్ని సేవలను దగ్గర చేయడం ద్వారా అదనంగా డబ్బు సంపాదించాలని ఎయిర్ లైన్స్ భావిస్తున్నాయి. ఇందులో భాగంగా, ప్రయాణికుల నుంచి తీసుకున్న ఫీడ్ బ్యాక్ మేరకు కొన్ని ప్రతిపాదనలు చేయగా, వీటిపై డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్) సైతం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కొత్త ప్రతిపాదనల ప్రకారం విమానాశ్రయాల్లో చెకిన్ కోసం వేచి ఉండటం తప్పనిసరి. అయితే కొంత అదనపు డబ్బుతో ఎంత మాత్రం వెయిటింగ్ లేకుండా నిమిషాల్లో తనిఖీని పూర్తి చేసుకొని లాంజ్ లోకి వెళ్లిపోవచ్చు. లాంజ్ లో కూడా అదనపు సొమ్ము చెల్లించి వీఐపీలు కూర్చునే చోట విశ్రాంతి తీసుకోవచ్చు. విమానంలో రెగ్యులర్ గా అందించే భోజనం బదులు ముందే కోరుకొని ఎక్స్ ట్రా చెల్లిస్తే ఎటువంటి ఆహారమైనా వచ్చేస్తుంది. వీటితోపాటు కోరుకునే సీటు, బ్యాగేజ్ చెకిన్ సౌలభ్యాలు అందించాలన్నది ఎయిర్ లైన్స్ అభిమతం. ఈ విషయంలో త్వరలోనే డీజీసీఏ నిర్ణయం వెలువడుతుందని తెలుస్తోంది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ తరహా సేవలను పలు విమానయాన సంస్థలు అందిస్తున్నాయి.