: రామ మందిరాన్ని నిర్మిస్తారా? లేదా?: ప్రధానిని నిలదీయనున్న వీహెచ్ పీ!
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రామ మందిరం నిర్మాణంపై హిందూవాదుల ఆశలకు జీవం వచ్చింది. త్వరలో బాబ్రీ మసీదు స్థానంలో రామ మందిరం నిర్మితమవుతుందని కూడా హిందూవాద సంస్థలు పలుమార్లు ప్రకటనలూ గుప్పించాయి. అయితే దేశాభివృద్ధిపై ప్రధానంగా దృష్టి సారించిన మోదీ ప్రభుత్వం, ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్న దాఖలా కనిపించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అనుబంధ విభాగం విశ్వ హిందూ పరిషత్ సహనం కోల్పోయినట్లుంది. రామ మందిరం నిర్మాణం విషయాన్ని ప్రధాని వద్దే తేల్చుకోవాలని ఆ సంస్థ తీర్మానించింది. ఈ విషయంలో ప్రధానిని కలిసేందుకే నిర్ణయించుకున్నామని ఆ సంస్థ అధికార ప్రతినిధి శరద్ శర్మ చెప్పారు. వచ్చే నెల 25 నుంచి రెండు రోజుల పాటు జరగనున్న కేంద్రీయ మార్గదర్శక మండల్ సమావేశాల అనంతరం ప్రధానిని కలుస్తామని ఆయన కొద్దిసేపటి క్రితం లక్నోలో ప్రకటించారు.