: శవాల కోసం వెళ్లారని కూడా చూడలేదు... కాల్పులకు తెగబడ్డారు!
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలోని దోర్నపాల్-చింతగుఫా వద్ద జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన ఎస్టీఎఫ్ జవాన్ల పార్థివ దేహాలు తెచ్చుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లిన సీఆర్పీఎఫ్ బలగాలకు మావోయిస్టులు కాల్పులతో స్వాగతం పలికారు. దీంతో వెనుదిరిగిన బలగాలు మరిన్ని బలగాలతో ఆ ప్రాంతం చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని, బేస్ క్యాంపుకు తరలించారు. ఎన్ కౌంటర్ వివరాలు వెల్లడిస్తూ...కూంబింగ్ ముగించుకుని బేస్ క్యాంపుకు వస్తున్న పోలీసులను సుమారు 200 మంది మావోయిస్టులు చుట్టుముట్టారు. దీనిని గమనించిన జవాన్లు ఫైర్ ఓపెన్ చేశారు. మావోలు కూడా కాల్పులు ప్రారంభించడంతో రెండు గంటలపాటు మోగిన తుపాకి చప్పుళ్ల మధ్య ఏడుగురు జవాన్లు మృతిచెందగా, 11 మంది గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2013లో కాంగ్రెస్ నేతలపై మావోయిస్టులు విరుచుకుపడిన అనంతరం, ఈ స్థాయిలో కాల్పులకు తెగబడడం ఇదే ప్రథమం.