: సభ సాక్షిగా జైట్లీని నిలదీసిన జేసీ
ధైర్యమున్న నేతగా పేరున్న టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని ప్రత్యేక హోదాపై నిలదీశారు. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రంలో జరిగిన జాతీయ కస్టమ్స్ అకాడమీ ప్రారంభోత్సవ సభలో పాల్గొన్న సందర్భంగా ఈ సన్నివేశం చోటుచేసుకుంది. స్థానిక ఎంపీగా కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రధాని రాజ్యసభలో హామీ ఇచ్చిన 'ఏపీకి ప్రత్యేక హోదా' సంగతేమైందని ప్రశ్నించారు. అనంతపురం జిల్లాకు రాయితీలు ఏవని ఆయన కాస్త ఆవేశంగానే నిలదీశారు. తరువాత సర్దుకున్న ఆయన, పన్ను రాయితీలు, కరవు భత్యాలు ప్రకటించి జిల్లాను ఆదుకోవాలని కోరారు. రాయలసీమకు నీరందించేందుకు బాబు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారని, ఆయనకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.