: రోజా అన్ని కులాలను గౌరవించడం నేర్చుకోవాలి: టీ.దళిత సంఘం అధ్యక్షుడు రాములు
ఎస్సీ, ఎస్టీలపై నటి, ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలపై పలువురు మండిపడుతున్నారు. ముందు ఆమె సినిమా భాషను పక్కనపెట్టి అన్ని కులాలను గౌరవించడం నేర్చుకోవాలని తెలంగాణ దళిత సంఘం అధ్యక్షుడు గంధం రాములు హితవు పలికారు. వెంటనే ఆమెపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దళితులపై ఆమెకున్న గౌరవం ఎలాంటిదో ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆమె దళితులను కించపరిచేలా మాట్లాడారని గంధం ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు దళితులపై రోజా చేసిన వ్యాఖ్యలపై ఏపీలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆమె దిష్టిబొమ్మను దళిత సంఘాలు దహనం చేశాయి. క్షమాపణ చెప్పాలని సంఘం నేతలు డిమాండ్ చేశారు. రోజాపై కేసు నమోదు చేయాలని సీఎం, స్పీకర్ లకు ఫిర్యాదు చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అనిత తెలిపారు.