: ఎంట్రీ ట్యాక్స్ మనమూ వేద్దామా?: అధికారుల ప్రతిపాదనపై ఏపీ సీఎం తర్జనభర్జన!
హైకోర్టులో ఎంట్రీ ట్యాక్స్ పై తెలంగాణకు అనుకూలంగా తీర్పు వచ్చిన నేపథ్యంలో ఏపీ కూడా అదే దిశగా పయనిస్తోంది. ఎంట్రీ ట్యాక్స్ పేరిట తెలంగాణ ప్రభుత్వం ఏపీ, ఇతర రాష్ట్రాల వాహనాలపై భారీ ఎత్తున పన్ను వసూలు చేస్తోంది. దీనిపై ఏపీలోని ట్రావెల్స్ యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రవేశించే ఇతర రాష్ట్రాల వాహనాలు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేనని చెప్పిన కోర్టు, ఆ నిధులను విచారణ ముగిసేదాకా వినియోగించడానికి వీల్లేదని తెలంగాణ రాష్ట్రాన్ని ఆదేశించింది. అయితే పొరుగు రాష్ట్రం ఎంట్రీ ట్యాక్స్ ప్రవేశపెడితే, అదే బాటలో మనమూ పయనిద్దామంటూ ఏపీ అధికారులు సీఎం చంద్రబాబు ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే ఇప్పటికిప్పుడు దీనిపై నిర్ణయం బాగోదన్న చంద్రబాబు, చైనా పర్యటన తర్వాత ఆలోచిద్దామంటూ దాటవేశారట. తెలంగాణ సర్కారు నిర్ణయం మాదిరే వెనువెంటనే తామూ ఎంట్రీ ట్యాక్స్ పేరిట పన్ను వసూలును మొదలుపెడితే, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భావనతోనే ఆయన దీనిపై నిర్ణయాన్ని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.