: భారత వాయుసేనకు 60 రఫాలే యుద్ధ విమానాలు... కుదరనున్న డీల్!
తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ లో ఉన్న భారత ప్రధాని భారత వాయుసేనను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్, మోదీల మధ్య జరిగే సమావేశంలో లాంఛనంగా నిర్ణయం తీసుకోనున్నారు. 60 రఫాలే యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు డీల్ దాదాపు ఒకే కాగా, ఈ విషయంలో సాయంత్రం జరిగే సంయుక్త మీడియా సమావేశంలో ఇరువురు నేతలు ప్రకటన వెలువరించవచ్చు. రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిన తరువాత కోట్లాది డాలర్ల విలువ చేసే ఒప్పందాలు కుదుర్చుకునేందుకు విదేశీ ప్రభుత్వాలు తీవ్రస్థాయిలో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సోవియట్ యూనియన్ కాలం నాటి భారత ఆయుధాలను ఆధునికీకరించే ప్రక్రియ మొదలుకావడంతో ఫ్రాన్స్ తో పాటు అమెరికా, బ్రిటన్ తదితర దేశాలకు చెందిన కంపెనీలు భారత్ తో ఇప్పటికే సంప్రదింపులు జరిపాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్న దేశంగా ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే.