: బయ్యారం గనులపై రాద్ధాంతమేల?: సీఎం
బయ్యారం గనుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బయ్యారం గనుల్లో లభ్యమైన ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేటాయించడం పట్ల విపక్షాలు రాద్ధాంతం చేయడంలో అర్థంలేదని సీఎం అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతానికో చెందినదని భావించడం సరికాదని హితవు పలికారు. ఆ కర్మాగారాన్ని 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదం పేరిట పెను ఉద్యమం నిర్వహించి సాధించుకున్నదని తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రజలందరికీ హక్కు ఉంటుందని, అలాంటి చారిత్రక స్టీల్ ప్లాంట్ కు బయ్యారం గనులను కేటాయిస్తే, నష్టమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమ ప్రాధాన్యం కల్పిస్తుందని సీఎం చెప్పుకొచ్చారు.