: నేతాజీ కుటుంబంపై నాటి నెహ్రూ ప్రభుత్వం నిఘా!: ఐబీ ఫైళ్ల ద్వారా వెల్లడి
అనుమానాస్పద రీతిలో అదృశ్యమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కొన్ని కొత్త విషయాలు వెల్లడయ్యాయి. ఆయన కుటుంబ సభ్యులపై నాటి జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వం దాదాపు 20 ఏళ్ల పాటు గూఢచర్యం చేసినట్టు తెలిసింది. తాజాగా బహిర్గతమైన రెండు ఇంటెలిజెన్స్ బ్యూరో ఫైళ్లు, ప్రస్తుతం దేశ ఆర్కివ్క్స్ గా ఉన్న వాటి ద్వారా 1948 నుంచి 1968 మధ్య జరిగిన విషయాలు బట్టబయలయ్యాయి. విషయమేంటంటే, నెహ్రూ 1947 నుంచి మరణించేవరకూ అంటే 64 వరకు దేశ ప్రధానిగా ఉన్నారు. ఆ ఫైళ్లలోని సమాచారం ప్రకారం, నాడు కోల్ కతాలోని బోస్ కు చెందిన 1 ఉడెన్ బర్న్ పార్క్, 38/2 ఎల్గిన్ రోడ్ లోని రెండు నివాసాలపై ఐబీ నిఘా ఉంచిందట. వాటిపై నేరుగా నెహ్రూకు నివేదిక ఇచ్చేవారట. బోస్ కుటుంబ సభ్యులు రాసిన లెటర్ కాపీలు, వారు దేశంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ప్రయాణించేవారో ఐబీ తెలుసుకునేదట. అయితే ఆయన కుటుంబ సభ్యుల గురించిన విషయాలను ఎందుకు నివేదిక సమర్పించాలన్నారో స్పష్టంగా తెలియదట. ప్రధానంగా శరత్ చంద్రబోస్ కుమారులు, నేతాజీ మేనల్లుళ్లయిన అన్నదమ్ములు - శిశిర్ కుమార్ బోస్, అమియా నాథ్ బోస్ లకు సంబంధించిన విషయాలను ఐబీ ట్రాక్ చేసేదట. వాళ్లు అప్పుడప్పుడు ఆస్ట్రియాలో ఉన్న నేతాజీ భార్య ఎమిలి షెనకల్ కు పలుమార్లు లెటర్లు రాసేవారట. బోస్ కు సంబంధించిన రహస్య ఫైళ్ళను బహిర్గతం చేసేందుకు కేంద్రం ఇటీవల నిరాకరించింది. ఇందుకుగల కారణాలు తెలపాలంటూ తాజాగా కలకత్తా హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ మరుసటి రోజే ఫైళ్ల వివరాలు బయటపడటం గమనార్హం.