: పైలెట్ కు డ్రగ్స్ ఇచ్చిన లుబిట్జ్... జర్మన్ వింగ్స్ కూల్చివేత కుట్రలో మరో కోణం
గత నెలలో జర్మన్ వింగ్స్ విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేసి 149 మంది మరణానికి కారణమైన కో- పైలట్ లుబిట్జ్ కుట్రలో మరో కోణం వెలుగు చూసింది. లుబిట్జ్ ల్యాప్ టాప్ ను శోధించగా ఒక కొత్త విషయం బయటపడిందని దర్యాప్తు సంస్థ నేడు తెలిపింది. ల్యాప్ టాప్ లో డ్యురెటిక్ డ్రగ్ (పదే పదే మూత్రవిసర్జన కలిగించే ద్రవ్యం) పనితీరుపై లుబిట్జ్ సమాచారాన్ని వెతికాడని తేలినట్టు అధికారులు తెలిపారు. కాఫీలో డ్యురెటిక్ డ్రగ్ కలపడం ద్వారా పైలట్ ను కాక్ పిట్ నుంచి బయటికి పంపితే, తన కుట్రను సులువుగా అమలు చేయొచ్చని లుబిట్జ్ భావించి ఉండొచ్చని వివరించారు. కాక్ పిట్ లో పైటల్ పాట్రిక్ తాగిన కాఫీలో లుబిట్జ్ ఈ డ్రగ్ ను కలిపి ఉంటాడని ఫ్రెంచి బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎనాలసిస్ సంస్థ ఇప్పుడు బలంగా నమ్ముతోంది.