: లిఫ్టులో ఇరుక్కుని షాక్ తిన్న కేంద్ర మంత్రులు!
కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సహాయ మంత్రి కిరణ్ రిజిజు, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ లిఫ్టులో ఇరుక్కుని షాక్ తిన్నారు. లిఫ్టును తెరవడం సాధ్యం కాకపోవడంతో కంగుతిన్న సిబ్బంది దాని పైకప్పును తొలగించి, వారిని బయటికి తీశారు. ఈ విషయాన్ని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లోని సీఆర్పీఎఫ్ కార్యాలయంలోని 'శౌర్య దివస్' కార్యక్రమంలో పాల్గొనేందుకు సహాయ మంత్రితో కలిసి ఆయన వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికిన సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ తో కలిసి లిఫ్టులోకి వెళ్లారు. పై ఫ్లోర్ లోకి వెళ్తుండగా లిఫ్టు ఆగిపోయింది. దీంతో కంగారుపడ్డ సిబ్బంది దానిని తెరిచేందుకు ప్రయత్నించారు. అది తెరచుకోకపోవడంతో, దాని పైకప్పు తొలగించి ముగ్గురినీ బయటికి తీశారు. దీంతో అంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు.