: ఢిల్లీలో కేజ్రీవాల్ ఇంటి ముందు బీజేపీ కార్యకర్తల ఆందోళన
ఢిల్లీలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు బీజేపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చేశారు. గతవారం టర్క్ మన్ గేట్ రోడ్ ప్రాంతంలో మరణించిన ఓ వ్యక్తి మృతి వెనుక ఆమ్ ఆద్మీ పార్టీ నేతల హస్తం ఉందంటూ ఆరోపిస్తున్నారు. గత ఆదివారం అర్ధరాత్రిన ఓ బైక్, హ్యుందాయ్ ఐ 20 కారు ఢీకొన్నాయి. దాంతో కారులోని వ్యక్తులు బైక్ వ్యక్తిని కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. తరువాత ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆప్ నేత, పర్యావరణ శాఖ మంత్రి అసిమ్ అహ్మద్ ఖాన్ కు తెలుసునని, వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ నేత సతీష్ ఉపాధ్యాయ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేజ్రీ నివాసం ఎదుట ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. వారిని చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్లను కూడా ఉపయోగించారు.